Friday, September 23, 2011

బ్రెజిల్ పర్యటన

మా బృందం సభ్యులు Embrapa Director General తో  

నేను దక్షిణ అమెరికా, ముఖ్యంగా బ్రెజిల్ సందర్శించాలని ఎన్నో రోజులుగా కలలు కంటుండగా వ్యవసాయం మరియు ఉద్యానవన రంగాల్లో రిసెర్చ్ సహకారానికి బ్రెజిల్ లోని Embrapa తో చర్చించడానికి AP హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం బోర్డు అఫ్ మేనేజ్మెంట్ సభ్యునిగా ఒక అవకాశం వచ్చింది. మా టీంలోని 6 సభ్యులలో శాస్త్రవేత్తలు, రాజకీయ ప్రతినిధులు మరియు ఇతర నిపుణులు ఉన్నారు. Embrapaను  మన ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ తో   పోల్చవచ్చు. బ్రెజిల్ మరియు భారతదేశం వాతావరణం, అధిక జనాభా, సహజ వనరులను మొదలైనవాటిలో అనేక విధాలుగా పోలి ఉంటాయి. దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అతిపెద్ద దేశం మరియు  జనాభా ప్రాతిపదికన ప్రపంచంలో ఐదవ పెద్ద దేశం. దేశ భూభాగం 85,14,877 చదరపు కిలో మీటర్లు,GDP  US$ 2,172 ట్రిలియన్ మరియు తలసరి ఆదాయం US$ 11,239. బ్రెజిల్ 1822 లో పోర్చుగల్ నుండి  స్వాతంత్రం పొందింది. అందుకే సహజంగా  పోర్చుగీసు వారి జాతీయ భాషగా మారింది. Brasillia దేశ రాజధాని కానీ సావో పాలో అతిపెద్ద నగరం. వచ్చే 20 సంవత్సరాలలో  ప్రపంచాన్ని ఆర్ధిక అభివృద్ధిలో  డ్రైవ్ చేసే BRICS (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణ ఆఫ్రికా) దేశాలలో  బ్రెజిల్ను  ఒకటిగా భావిస్తారు.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో బ్రెజిల్ ఒకటి. గత 10 సంవత్సరాలకు పైగా  5% సగటు రేటు GDP  పెరుగుదలతో మిగులు విదేశీ మారక విలువలు  కలిగి ఉంది.  బ్రెజిల్ యొక్క ఆర్థిక బలం చెప్పాలంటే గత 3 సంవత్సరాలలో బ్రెజిలియన్ కరెన్సీ విలువ అమెరికన్ డాలర్ తో పోల్చితే దాదాపు 30% వృద్ధి పొందింది.




బ్రెజిల్  సంస్కృతి యూరోపియన్లు, ఆఫ్రికన్లు మరియు అమెరికన్ ఇండియన్ల భాగస్వామ్యంతో ఉంటుంది. ఈ  మిశ్రమ వైవిధ్యం, దేశంలో  వివిధ ప్రాంతాలకు  ప్రయాణం  మరియు సాంబా మరియు బోస్సానోవా నృత్య శైలులు బ్రెజిల్ ను ఒక గొప్ప స్థానంలో ఉంచుతాయు. బ్రెజిల్ లో రెండు విషయాలు ముఖ్యం.  మొదట  కార్నివాల్ మరియు రెండవది సాకర్. బ్రెజిల్ లో కార్నివాల్ ఈస్టర్కు  46 రోజుల ముందు నిర్వహించే  ఒక వార్షిక పండుగ. దీంట్లో విరామంలేని సంగీతం, సుందరమైన దుస్తులతో డ్యాన్స్, విన్యాసాలు ఉంటాయు. బ్రెజిల్  జాతీయ సాకర్ జట్టు FIFA  ప్రపంచ కప్ రికార్డు 5 సార్లు గెలిచింది.

బ్రెజిల్ ఆర్టిక వ్యవస్తలో  పరిశ్రమలు, వ్యవసాయం, మరియు ఇంధన శక్తి ప్రముఖ పాత్ర వహించుతున్నాయి. కాని  ఇటీవల సర్వీసెస్ రంగంలో కూడా బ్రజిల్ దూసుకు పోతుంది. అంతేకాకుండా వోక్స్‌వాగన్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, ఫియట్, హోండా, మరియు టయోటా వంటి అంతర్జాతీయ కార్ల పరిశ్రమల ప్రవేశంతో బలమైన ఆటోమోటివ్ పరిశ్రమ పెంపొందింది. భారతదేశం  ఏటా సుమారు 3.5 మిలియన్ కార్లు తయారు  చేస్తే, బ్రెజిల్ ప్రతి సంవత్సరం 4 మిలియన్ల కార్లు తయారు చేస్తున్నది. ప్రపంచంలోనే మొదటగా బ్రెజిల్  కార్లు,  గాసోలిన్, ఇథనాల్ మిక్స్  ద్వార నడపడానికి ఇంధన సాంకేతిక పరిజ్ఞానం సంపాదించి అమలుచేయడానికి అవసరమైన చట్టం రూపొందించింది. ప్రపంచలో  బ్రెజిల్ను  మొదటి సమర్థనీయ బయో ఇంధన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా బావిస్తారు.  బ్రెజిల్  FIFA ప్రపంచ కప్ కు  2014 లో అలాగే 2016 లో ఒలింపిక్స్ ఆతిధ్యం ఇవ్వబోతుంది. రాబోయే నాలుగు సంవత్సరాలలో బ్రెజిల్ మౌలిక సదుపాయాలు, సర్వీసెస్ రంగాలలో  గణనీయమైన పెట్టుబడులు పెడుతుందని భావిస్తున్నారు.

మేము మొదటి దక్షిణ ఆఫ్రికన్ ఎయిర్ లైన్స్ ద్వారా Brassilia చేరుకున్నాము. Brasilia  ఒక అద్భుతమైన నగరం. ఈ పట్టణం 1960 నుండి బ్రెజిల్ రాజధాని నగరంగా  ఉంది.  నగరంలో  సంవత్సరం పొడుగునా  అద్భుతమైన వాతావరణం  ఉంటుంది. Brasilia దక్షిణ అమెరికాలో  అత్యంత సృజనాత్మక, ఆధునిక నిర్మానాలు కలిగిన నగరం ఎందుకంటే  అది ఇటీవల నిర్మించిన నగరం. నగరంలో  ఆకాశమంత ఎత్తులో ఆసక్తికరమైన భవనాలు ఉన్నాయు. ముఖ్యంగా, బ్రెజిలియన్ అధ్యక్షుడు నివసించే Palacio da Alvorada వంటి రాజభవనాలు ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.

జోసేలినో కుబెశాకే (Juscelino Kubitschek) 1956 లో "ఐదు యాభై సంవత్సరాలు" నినాదంతో  బ్రెజిల్ అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు.  బ్రెజిల్ క్రితం యాభై సంవత్సరాలు గా సాదించిన అభివృద్ధి  తన ఐదు సంవత్సరాల కాలంలోనే సాదించాలని  అతని ప్రణాళిక. అందుకే   1956 లో  కొత్త రాజధాని నిర్మించడానికి యువ శిల్పి, ఆస్కార్ ను ఆహ్వానించాడు. బ్రెజిల్ లో Oscar Niemeyer  గొప్ప 20 శతాబ్దం ఆర్కిటెక్ట్ గా పరిగణించబడుతాడు. నగర నిర్మాణం పూర్తి కాకుండానే Juscelino రాజధాని Brasília వ్యవస్థాపకుడు కావాలనే ఆలోచనతో అధికారికంగా  ఏప్రిల్ 22 1960 న నగరం ప్రారంబించాడు. 


 స్నేహితుడు అమర్ నాథ్ రెడ్డి తో, బ్రెజిలియన్  పార్లమెంట్ భవనం ముందు
 
Brasilia, కేవలం ఒక పరిపాలన నిర్వాహక నగరం. అధ్యక్షుడు మరియు అతనిఆఫీసు, నేషనల్ కాంగ్రెస్, సుప్రీం కోర్ట్ సీటు, మరియు అన్ని మంత్రి వర్గ భవనాలు నగరంలో ఒకే చోట వుంటాయు.  Juscelino Kubitschek మెమోరియల్ అతని రాజధాని నిర్మాణ ఫలితానికి ఒక నివాళిగా ఉంది. ఇక్కడే  Juscelino Kubitschek  సమాధి  వుంది.  ఈ భవనంలో  నగర చరిత్ర గురించి  పూర్తి సమాచారం వుంది.  మెట్రోపాలిటన్ కేథడ్రాల్ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఆస్కార్ నేమేయర్ మేధస్సుకు ఒక ప్రత్యేకమైన నిదర్శనం. ఈ  అద్భుతమైన కేథడ్రాల్ లోపల సుందరమైన గాజు  పనితనం ఉంది.  Brasilia  TV టవర్ నగరంలో ఎత్తైన భవనాలలో ఒకటి.  బ్రెజిల్ జాతీయ కాంగ్రెస్, పార్లమెంట్ భవనం ఆస్కార్ నేమేయర్ నిర్మించిన మరొక ప్రత్యేక భవనం. Embrapa కాంపస్ చేరుకోగానే మాకు డైరెక్టర్ జనరల్ ఆహ్వానం పలికారు. నేను ఆంధ్రప్రదేశ్ మరియు బ్రెజిల్ మధ్య సహకారానికి ఒక  పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చాను.





Brasillia లో మూడు రోజులు గడిపిన పిదప, మేము TAM ఎయిర్ లైన్స్ ద్వారా రియో​ డి జనీరో  చేరుకున్నాం. రియో డి జనీరో లేదా రియో బ్రెజిల్ దేశ  సౌత్ ఈస్ట్ ​ ప్రాంతంలో సుందర పర్వతాల మద్య , అట్లాంటిక్ సముద్రం ఒడ్డున ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరంగా గుర్తింపు పొందింది. చాలా యాత్రికులు తరచుగా న్యూయార్క్ నగరం ఎప్పుడూ పడుకోదు అని వింటారు, కానీ రియో నగరం కూడా ​ ఎప్పుడూ కన్ను మూయదు అంటే అతిశయోక్తి కాదు. మేము రియోలో Ipanema బీచ్ సమీపంలో Copacabana Beach ఎదురుగా ఒక ఆధునిక పదిహేను అంతస్తుల హోటల్ లో బస చేసాం. మేం హోటల్ నుండి Copacabana Beach  పొడవునా చేసిన వాకింగ్, మద్యలో కొబ్బరి బొండాల నీరుతో రిలాక్స్ కావడం, Ipanema బీచ్ లో ఇతర యాత్రికులు అక్కడ వెలువడే సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం మేం మరిచిపోని  జ్ఞాపకాలలో కొన్ని మాత్రమే. రియో డి జనీరో లో ప్రతి సంవత్సరం ఈస్టర్ కు 46 రోజుల ముందు జరిగే సాంబ,  కార్నివాల్  పోటీలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక హైలైట్. మేం వెళ్ళినపుడు కార్నివాల్  లేకున్నా ఆ పోటీలు జరిగే  Sambodromo సమీపంలో  ఒక theater లో ఒక రాత్రి Samba డాన్సు చూసాం.


సాంప్రదాయ సాంబా నృత్య దుస్తుల సంగ్రహాలయం లో 

రియో లో ముఖ్యంగా   చూడవలసినవి Corcovado పర్వతంపై  క్రీస్తు విగ్రహం మరియు Sugarloaf Mountain. గత సంవత్సరం  Corcovado క్రీస్తు విగ్రహం  ప్రపంచంలోని సెవెన్ వండర్స్ గా అర్హత పొందింది.  ఈ రెండు ప్రదేశాల నుండి కూడా  రియోడి జనీరో నగర అందాలను పైనుండి చూడవచ్చు. Sugarloaf Mountain కు కేబుల్ కారు ద్వారా వెళ్ళాము. ప్రయాణంలో మొదట Urca హిల్స్ చేరుకొని కాఫీ త్రాగుతూ ప్రక్రుతి అందాలను చూస్తుండగా దూరంలో వేరే నగరంలో ఉన్నట్లుగా  Corcovado  క్రీస్తు విగ్రహం  కనిపించింది. తర్వాత మళ్లీ కేబుల్ కారులో  ఇంకా పైకి వెళ్లి సుగర్ లోఫ్ కొండ చేరుకొని అట్లాంటిక్ సముద్ర అందాలను, నగరాన్ని వీక్షించాము. కేబుల్ కారులో క్రిందికి వచ్చి కర్కవడో పర్వతంపై  క్రీస్తు విగ్రహం చూడటానికి బయలుదేరాం.

 క్రీస్తు విగ్రహం  చూడటానికి  ట్రామ్ రైల్లో ముప్పై నిమిషాల Corcovado పర్వత ప్రయాణం ఒక ఆసక్తికరమైన అనుభవం. రైలు మెల్లగా కొండపై ప్రయాణం చేస్తూ దట్టమైన అడవి గుండా వెళుతుంది.  మేం పర్వతం చేరుకోవటానికి కొద్ది నిమిషాల ముందు కుడి చేతి వైపు ఎత్తైన చెట్ల సందుల మధ్యనుండి రియో నగర సుందర దృశ్యాలు మమ్ముల్ని ఆకర్షించాయి. మార్గ మద్యంలో ఒక సాంబ మ్యూజిక్  బ్యాండ్ బృందం ట్రామ్ ఎక్కి ప్రయాణం పొడవునా మాకు వీనుల విందైన సంగీతాన్ని అందించింది. మీకు నచ్చితే, ఇష్టమైతే వాళ్లకు  టిప్స్ కూడా ఇవ్వవచ్చు. ట్రామ్ రైల్ దిగగానే కొండ పైకి వెళ్ళడానికి సుమారు 200  మెట్లు ఎక్కవలసి వుంటుంది. లిఫ్టులు, ఎలివేటర్స్ కూడా ఉంటాయి. మేము మెట్లగుండానే పది నిమిషాల్లో కొండ పైకి వెళ్ళగానే మాకు మొదట విగ్రహం వెనుక బాగం కనిపించింది.

మేము చేరుకున్నప్పుడు కొండపై మబ్బులు క్రమ్మి వాతావరణం అంత బాగా లేదు. మేం   క్రీస్తు విగ్రహాన్ని, ఏంతో గొప్పగా విన్న రియో అందాలను సరిగా చూడగాలుగుతామో, లేదోనని అటు, ఇటు తిరుగుతూ అరగంట గడిపాం. అంతలో సూర్యుడు మెల్లగా కనిపిస్తూ, విగ్రహం చుట్టూ ఉన్న మేఘాలు తొలగి పోతూ ఉండడంతో మా ఆనందానికి అవధులు లేకపోయింది. కొండపై నుండి ఎటు చూసినా శోభాయమానమైన, రమణీయ దృశ్యాలే. 


ద్రాక్షసారా కర్మాగారము, పోర్ట్ అలెగ్రె.

మేము రియో నుండి TAM ఎయిర్ లైన్స్ ద్వార Porte Alegro చేరుకొని మూడు గంటల సౌకర్యవంతమైన కోచ్ రైడ్లో Benta Gonsalves పట్టణం వెళ్ళాం.  Benta Gonsalves పట్టణం  రియో గ్రాండ్ డూ సూల్ ప్రాంతంలో ఇటాలియన్ మూలాలు  గలవారి  మెజారిటీతో  ఉండడంతో ఆ సంస్కృతి,  సంప్రదాయాలు ఎక్కువగా కనబడుతాయు. ఈ  ప్రాంతం అంతా లోయలతో  ద్రాక్ష తోటలకు మరియు వైన్ ఉత్పత్తికి చాలా ప్రసిద్ది కావటంతో ఇది "వైన్ కాపిటల్ అఫ్ బ్రెజిల్" గా పిలువబడుతోంది. మేం పట్టణం దగ్గరలో వున్న అరోరా వినేయర్డ్ దర్శించాము. అక్కడ సంవస్తరాల తరబడి వైన్ తో నిలువవున్న ఓక్ బ్యారెళ్ల మధ్య enologists మాకు వైన్ ఉత్పత్తి ప్రక్రియ వివరించారు. పర్యటన ముగిసే సమయంలో మేము వివిధ ద్రాక్షారసాల రుచి ఆస్వాదించాము. ఇక్కడి రెస్టారెంట్లు విలక్షణ ఇటాలియన్ వంటకాలతో,  సంగీతంతో , ప్రతిరోజూ, యాత్రికులను అలరారుస్తాయి.

 తయారు చేసిన ద్రాక్ష సారా, చెక్క పీపాలలో,  భూగర్భంలో  నిల్వ చేస్తారు.

Porte అలేగ్రోకి ఇటాలియన్ ప్రాంత రాజధానిగా పిలువబడే గారిబాల్ది నగరంగుండా సాగిన మా తిరుగు ప్రయాణం యూరోపును గుర్తుచేస్తూ మళ్లీ ఏదో యూరప్ దేశంలో ఉన్న అనుభూతిని కలిగించింది. 


 పోర్చుగీసువారు  నిర్మించిన పురాతన రైల్వే స్టేషన్ ముందు, సావొ  పాలొ.

బ్రెజిల్లో మేం చివరగా ఆ దేశంలో అతి పెద్ద నగరం, వాణిజ్యానికి కేంద్రమైన  సావో పాలో నగరం దర్షించాము.  నిత్యం  ట్రాఫిక్ జామ్  లతో  నగరం ఏ మాత్రం సురక్షితం కాదని మేం విన్నాం. నగరం అంతా దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన వలసదారులతో ప్రతిరోజూ చాలా ఉరుకులు,పరుగులు తో ఉంటుంది. సాధారణంగా బ్రెజిల్ వాసుల సంస్కృతి  పగలు పని, రాత్రి జీవితం వినోదం అని అంటుంటారు. విశాలమైన  సావో పాలో నగరం క్లబ్బులు, థియేటర్లు, మ్యూజియంలు, నృత్యనాటిక, శాస్త్రీయ సంగీత ప్రదర్శనశాలలు, రెస్టారెంట్లు మరియు సూర్యోదయంవరకు సాగే రాత్రి వినోదాలకు చాలా ప్రసిద్ది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది నగరానికి గుండెకాయగా పిలువబడే పాలిస్తా అవెన్యూ. అవెన్యూ పొడవైన ఆకాశహర్మ్యాలు, దుకాణాలు, చర్చిలు, రెస్టారెంట్లు, కేఫ్లు, మ్యూజియంలు హోటల్స్, మరియు చెట్లతో ఉంటుంది. ఒక  మధ్యాహ్నం మేము సావో పాలో యొక్క చారిత్రాత్మక డౌన్ టౌన్ వెళ్ళాం. మా రెండు వారాల బ్రెజిల్ పర్యటన ఒక జీవిత కాలపు  ఆనందం మరియు అనుభవం. నా ఈ బ్రెజిల్ ప్రయాణ విశేషాలు కొందరికైనా ఉపయోగపడుతాయని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా బ్రెజిల్ వెళితే కొన్ని పోర్చుగీస్ పదాలు నేర్చుకుంటే కచ్చితంగా  ఉపయోగపడతాయి.

 ఫ్రీడం మెమొరియల్, సావొ  పాలొ.