Sunday, October 23, 2011

నీవే నా ప్రాణం

 తూర్పు దిక్కున 
ఉదయం నీవే
పడమర
సంధ్యా కిరణం నీవే
ఉత్తరాన
నా నీడవు నీవే
దక్షణాన
నా తోడువూ నీవే
నాలుగు దిక్కులా నీవే
పంచభూతాలూ నీవే
నా హృదయంలో 
ఊపిరి నీవే
నీవు నేనుగా లేని
నా ప్రపంచమే లేదు
ప్రియతమా!
నీవే నా ప్రాణం...

ఎలా చెప్పాలి చెలియా నీకు

ఎలా చెప్పాలి చెలియా  నీకు
ఈ ఎడబాటు నా ఎదలో గాయమని
ప్రతిరోజూ నువు చేసే ఫోనే
నా ఎద ఎడారిలో ఒయాసిస్  అని
ఈ తాత్కాలిక ఎడబాటు తడబాటు లేకుండా

మనం సమిష్టిగా  తీసుకొన్న నిర్ణయమే కదా

అయునా చెలియా ఎలా చెప్పాలి నీకు
నా మనసు నిన్నటిలా లేదని
ఈ రోజు నా ఆదీనంలో లేనే లేదని
రోజూ మనం ఫోనులో మాట్లాడుకుంటున్నా
నా పెదవులు నీతో ముద్దాడాలని
ఉర్రూతలూగుతున్నాయని
నా కళ్ళు నీ దేహంలో ప్రతి ఆంగులాన్ని
గుచ్చాలని  చూస్తున్నాయని
నా చేతులు నిన్ను తీగలా
అల్లుకోవాలని తహతహలాడుతున్నాయని
ఎలా చెప్పాలి చెలియా నీకు
నా మనసు నీ వెంటే ఉన్నదని
నా ఆలోచనలు నీ చుట్టే
పరిబ్రమిస్తున్నాయని
నీ రాక కోసం నేను
వేయు కళ్ళతో ఎదురు చూస్తున్నాని

ఎలా చెప్పాలి చెలియా నీకు
రోజూ ఉదయం నన్ను లేపటానికి
మన మద్య జరిగే యుద్ధం నాకిష్టమని
నీకు అప్పుడప్పుడు కోపం తెప్పించినా
నిజంగా నీవొక అమాయకురాలివని
నేనెప్పుడు చెప్పే మాట నీకెలా చెప్పడం చెలియా
ఎందుకంటే నీకు ప్రపంచంలో
కుట్రలు తెలియవు, కుతంత్రాలు తెలియవు
లౌక్యం తెలెయదు, లాభ, నష్టాలు అంతకన్నా తెలియవు
ప్రపంచమంతా స్వచ్చమైన పాల లాగ
తెల్లగా, ముక్కు సూటిగా ఉంటుందనుకునే నిన్ను
అమాయకురాలివనక ఇంకేమనాలి చెలియా !

నిను వదలని నీడను నేను

నిను వదలని నీడను నేను
ఎప్పుడూ నీ నీడై వున్నాను
మినియాపోలిసులో మెరుస్తున్న

చంద్రున్ని చూడు నేనున్నాను
మినియాపోలిసులో తడబడుతూ ప్రవేశించే
ఉషోదయపు  వెలుగులో నేనున్నాను
ఆ వెలుగులో మెరుస్తున్న
పువ్వుల్ని చూడు, నేనున్నాను
ముద్దబంతిలా ముద్దులొలికే
"రూహి"  నవ్వుల్లో నేనున్నాను
అనుక్షణం నీతోనే వున్నాను
ప్రతి క్షణం నీ తోడే వున్నాను
క్షణ క్షణం నీ గురించే ఆలోచన
ప్రతి  నిమిషం నిను చేరాలనే తపన 
ప్రతి  రాత్రి నా కలల్లో నీవే
అనుక్షణం నీ దరికి చేరాలనే నా ఆరాటం
నిను వదలని నీడను నేను
ఎప్పుడూ నీ నీడై వున్నాను
ఘండు తుమ్మెదలా నీ తోడే వుంటాను 

(మా కూతురు మహతికి "రూహి" పుట్టినపుడు  జూన్ 2011 లో నా వైఫ్ అనంతలక్ష్మి, 
మినియాపోలిసు, అమెరికా వెళ్లినపుడు  నాలో కలగిన భావాలు )

నీరీక్షణ

నీవు దగ్గరగా ఉన్నపుడు
ఎండకి, వానకి తేడా తెలియలేదు
నీవు దగ్గరగా వున్నపుడు అనుకోలేదు
ఎడబాటు ఇంత భయంకరంగా ఉంటుందని


ఎన్నో పున్నమిల ఎడబాటు తర్వాత నీవోస్తున్నావని
మెత్తని తీగల, మత్తుల పూవులు ఒత్తుగా అల్లిన
మన అనంత మమతల కుటీరం 
నీ  స్వాగతానికి తయారౌతుంది
మన ఇంటి ముందు మా నాన్న నాటిన  వేపచెట్టు
గూర్కాలా  నీకు సలాం చేయాలని చూస్తుంది


చిరు గాలి నీ రాక కోసం 
హడావిడి చేస్తుంటే 
పక్కనే వున్న పొంగామియా పొంచి పొంచి చూస్తుంటే
నీ రాక కోసం మన  ఇంట్లో ప్రతి కొమ్మ, రెమ్మ
ఉత్సాహంతో  రెపరెపలాడుతున్నాయు


పువ్వులన్నీ  నీ స్పర్శ కోసం తహలాడుతున్నాయు
గున్న మామిడి చెట్లు చిరు మందహాసం చేస్తున్నాయు
నువ్వోస్తున్నావని  మన ఇంట్లో

పక్షులు మూకుమ్మడిగా కిలకిలారావాలు చేస్తున్నాయు
మన వాటర్ ఫౌంటైన్  లో  తామెర పువ్వు
సూర్య కిరణాల్ని ఐక్యం చేసుకుంటూ కూడా 
నీ కొరకే ఎదురు
చూస్తుంది

నేను మల్లెల వెన్నెలతో స్వాగతం పలుకుతాను
స్నేహానురాగాల జల్లులు కురిపిస్తాను
చెలీ, నీ రాక కోసం
వెయ్యు కళ్ళతో  ఎదురు చూస్తున్నాను
కాలం కదలనని మొండికేస్తున్నా
క్షణ క్షణం నా నీరీక్షణ నీ కోసమే...


( మా కూతురు మహతి డెలివరీకి జూన్ 2011 లో నా వైఫ్ అనంతలక్ష్మి
అమెరికా వెళ్లినపుడు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నాలో కలగిన భావాలు)
 

Saturday, October 22, 2011

ముద్దుల బొమ్మ

                                                                      
రూహి ఓహో రూహీ
ఎందరి ఆత్మవో నువ్వు 
మరెందరి సుందర
స్వప్నానివో నువ్వు 
ఖండాంతరాల దూరంలో 
సప్త సముద్రాల కవతల
నేలకి దిగిన తారవి నువ్వు
తుషార భూమిలో వెలసిన 
పటీరము నువ్వు 
మా సుదాపయోదివి  నువ్వు 
మా స్వప్న శారిక నువ్వు 
మా అమ్మవి నువ్వు 

 
దూరాలు దాటి, తీరాలు దాటి 
నీ బారసాల సంబరాలకు వచ్చి 
మొదటిసారి నిన్ను చూసినపుడు 
ఏదో భావోద్వేగం, ప్రేమభావం  
నువ్వు కురిపించిన నవ్వుల వర్షపు జల్లు 
కోటి హిమకాంతులను మురిపించింది
ముద్దులొలికే నీ నవ్వు  
నిండు వెన్నలను సైతం
నల్ల మొహం వేయుస్తుంది
గుండెల్లో గులాబీలు పూయుస్తుంది
భాదల్ని మరిపిస్తుంది 
భావాల్ని వెలికి తీస్తుంది
కవితల్ని కదిలిస్తుంది 

మందారానికి బంగారం అద్దిన 
నీ నవ్వులు  

మా మధురిమల పుష్పాలు 
మా మురిపాల నేస్తాలు
మాకు కోటి చిరుదివ్య కాంతి పుంజాలు 
  
నీ నవ్వే నా కవితకు రాగం, తానం, పల్లవి
ఇకనుంచి జీవితమంతా  
మా ముద్దుల బొమ్మవి  నువ్వే, నీ నవ్వే!

( మా మహతి- ప్రేమచంద్ లకు కూతురు "రూహి" పుట్టినపుడు జూన్ 2011 లో 
నేను మినియాపోలిస్ వెళ్లి   చూసినపుడు నా మదిలో కలిగిన భావాలు )